సమీక్ష : బాహుబలి – ఎమోషనల్ విజువల్ వండర్..

మూడు సంవత్సరాలుగా కష్టపడి జక్కన్న చెక్కిన చిత్రం బాహుబలి,  తెర మీద పడింది. ప్రభాస్,రానా,తమన్న,అనుష్క, రమ్యకృష్ణ లు ప్రధాన పాత్రలతో రూపొందించబడిన ఈ సినిమా  తెలుగు పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ ది. అటువంటి చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది

ఓవరాల్ సినిమా:

మొదట్లో కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది, తర్వాత కొద్ది కొద్దిగా వేగం పుంజుకొని క్లైమాక్స్ కు వచ్చే సరికి గతం లో ఎన్నడూ చూడని ఓ కొత్త విజువల్  వరల్డ్ ను చూపించాడు దర్శకుడు. కానీ సినిమాలోని పాత్రలను ప్రెస్ మీట్ లకు, ప్రమోషన్లకు ఉపయోగించుకోవడం వల్ల తెర మీద కొత్త పాత్రలను చూస్తున్న ఫీల్ ను మిస్ అయ్యారు ప్రేక్షకులు. స్టోరి మరీ పాతదైపోయింది




దర్శకత్వం : ఎస్.ఎస్ రాజమౌళి
నిర్మాత : శోభు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని
సంగీతం : ఎం.ఎం కీరవాణి
నటీనటులు : ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ..

కథ :
శివగామి(రమ్యకృష్ణ) పొత్తిళ్ళలో ఉన్న తన కొడుకు బిడ్డని ఎత్తుకుని శత్రువుల నుంచి తప్పించుకుంటూ వస్తూ ఉండగా ఓ భారీ జలపాతంలో పడిపోతుంది. తను చనిపోయి ఆ బిడ్డని కాపాడుతుంది. అ బిడ్డ వరద ప్రవాహంలో కొట్టుకుంటూ అంబలి గ్రామంకి చేరుకుంటాడు. అక్కడ ఆటవిక తెగకి చెందిన రోహిణి ఆ బిడ్డని పెంచుతుంది, అలాగే తనకి శివుడు అనే పేరు పెడుతుంది. చిన్నప్పటి నుంచి తన గ్రామానికి ఆనుకొని ఉన్న కొండలకి పైన ఏముంది తెలుసుకోవాలనే కోరిక శివుడులో బలంగా ఉంటుంది. ఒకరోజు ఆ జలపాతం నుంచి జారి పడిన మాస్క్ ద్వారా కొండపైకి చేరుకుంటాడు. అక్కడ అవంతిక(తమన్నా)ని చూసి ప్రేమలో పడతాడు.
కానీ అవంతిక ఒక వారియర్ లా మాహిష్మతి రాజ్యానికి రాజు అయిన భళ్లాలదేవ దగ్గర బందీగా ఉన్న దేవసేన(అనుష్క)ని విడిపించి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే టైంలో శివుడు – అవంతిక ప్రేమలో పడతారు. దాంతో అవంతిక లక్ష్యాన్ని తన లక్ష్యంగా మార్చుకొని శివుడు దేవసేనని కాపాడి తీసుకురావడానికి మాహిష్మతికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన శివుడు దేవసేనని కాపాడటం కోసం ఏం చేసాడు.? దేవసేనని కాపాడే సమయంలో శివుడు తెలుసుకున్న నిజం ఏమిటి.? ఆ మాహిష్మతి కథ ఏంటి? అవంతికకి దేవసేనకి ఉన్న సంబంధం ఏమిటి.? అన్నది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి తెలుసుకోవాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :
ఎస్ఎస్ రాజమౌళి స్పెషాలిటీ ఏంటంటే సినిమా బ్యాక్ డ్రాప్ ఏదైనా ప్రతి 15 నిమిషాలకు ఆడియన్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఓ సీన్ రావాల్సిందే అంటాడు.. అలాంటి సీన్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అలా సినిమాలో వచ్చే ఓ ఐదు సీన్స్ ని, వార్ ఎపిసోడ్ ని చాలా బాగా ఎలివేట్ చేసాడు. విజువల్స్ పరంగా రెండున్నర గంటలు మీకు థియేటర్లో ఓ కొత్త ప్రపంచాన్ని చూపిస్తాడు. రాజమౌళి తను రాసుకున్న ప్రతి పాత్రలోని ఎమోషన్ ని ది బెస్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. నటీనటులు పూర్తి న్యాయం చెయ్యడం బాహుబలికి మేజర్ ప్లస్ పాయింట్. మాహిష్మతి రాజ్యం కోసం క్రియేట్ చేసిన ప్రతి సెట్స్ మిమ్మల్ని అబ్బుర పరుస్తాయి, అలాగే చూడటానికి రెండుకళ్ళు సరిపోవేమో అనేలా సెట్స్ ని డిజైన్ చేసారు. ఆ సెట్స్ మీకో కొత్త అనుభూతిని కలిగిస్తాయి.
ఈ సినిమాకి మేజర్ గా హైలైట్ గా అనిపించే అంశాల విషయానికి వస్తే.. సినిమా ప్రారంభం చాలా బాగుంది. మొదటి 2 నిమిషాల్లోనే మిమ్మల్ని బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతాడు. శివుడుగా ప్రభాస్ ఇంట్రడక్షన్, ఆ తర్వాత శివలింగంతో వచ్చే ఎపిసోడ్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టిస్తుంది. తమన్నా కోసం ప్రభాస్ కొండల్లో చేసిన రిస్క్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఇక తమన్నా ఎంట్రీలో వచ్చే ఓ యాక్షన్ ఎపిసోడ్, మంచుకొండల్లో వచ్చే ఎపిసోడ్ బాగుంటుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇంటర్వెల్ తర్వాత దేవసేనని కాపాడే సీన్, అక్కడ అడవి శేష్ గ్యాంగ్ తో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్ ని తారా స్థాయికి తీసుకెళుతుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రభాస్ మరియు రానాల ఇంట్రడక్షన్, శివగామి పాత్రలోని ఎలివేషన్ సీన్స్ సూపర్బ్. ఇక సుమారు 30 నిమిషాల పాటు సాగే వార్ ఎపిసోడ్ ఆడియన్స్ మతి పోగొడుతుంది. ఈ వార్ లో వాడే టెక్నిక్స్, ప్రభాస్, రానా, సత్యరాజ్ లు పోరాడే సీన్స్ మరియు వారి పై షూట్ చేసిన కొన్ని సీన్స్ ఆడియన్స్ ని సీట్లలో కూర్చో నివ్వవు. రాజమౌళి, సెంథిల్ కుమార్, సాబు సిరిల్, శ్రీనివాస్ మోహన్ కలిసి క్రియేట్ చేసిన మాహిష్మతి రాజ్యం, ఆ రాజ్యం కోసం వేసిన సెట్స్ మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.
బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మొదటగా సినిమాలోని కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ తర్వాత ఆ పాత్రలను అల్లుకుంటూ కథను రాసుకున్నారు. ఈ సినిమా కోసం నటీనటులంతా మూడేళ్ళు సమయం కేటాయించారు. అందుకే వారందరి గురించి సూటిగా సుత్తి లేకుండా చెప్తా..
‘శివుడు’గా ప్రభాస్ – చిన్నప్పుటి నుంచే ఆటవిక ప్రాంతంలో పెరిగిన శివుడుకి కొండలు, కోనల్లో సాహసాలు చేయడంలో దిట్ట. అలాంటి పాత్రలో ప్రభాస్ రిస్కీ స్టంట్స్ బాగా చేసాడు. ముఖ్యంగా కేరళలో షూట్ చేసిన సీన్స్, తమన్నా కోసం వెళ్ళినప్పుడు వచ్చే కొన్ని సీన్స్ మిమ్మల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. ఇంట్రడక్షన్ సీన్ లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ చెప్పాడు.
‘బాహుబలి’గా ప్రభాస్ – బలమైన బాహువులు కలిగిన బాహుబలి లుక్ లో ప్రభాస్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాహుబలి పాత్రలో ప్రభాస్ మునుపెన్నడూ కనపడని భారీ కాయంతో, బలమైన కండలతో కనిపిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ కటౌట్ చూస్తే మీ ఒళ్ళు గగుర్పోడిచేలా ఉంటుంది. బుద్ధిబలం – కండబలం కలగలిపిన ఈ పాత్రలో ప్రభాస్ పెర్ఫార్మన్స్ అదరహో అనేలా అంది. వార్ సీక్వెన్స్ లో ప్రభాస్ చూపిన వీరత్వం మీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది.ప్రభాస్ బాహుబలి, శివుడు పాత్రలకి మధ్య వైవిధ్యం బాగా చూపించాడు.
‘భళ్లాలదేవ’గా రానా – ఇప్పటివరకూ చూసిన రానా ఒక లెక్క, బాహుబలిలో కనపడే రానా ఒక లెక్క.. రాజమౌళి అంటేనే విలననిజంలో ఉచ్చస్థాయిని చూపిస్తాడు, ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా రానా పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. శత్రువు ఎదురొస్తే బుద్ది బలంకంటే కండబలంని నమ్ముకునేవాడిగా, కౄరత్వం అనేది అతన్ని చూసే పుట్టిందా అనే స్వభావం కలిగిన భళ్లాలదేవ పాత్రలో రానా చూపిన పెర్ఫార్మన్స్ న భూతో న భవిష్యత్ అని చెప్పాలి. యుద్ద భూమిలో భళ్లాలదేవగా రానాని స్క్రీన్ పై చూస్తుంటే కూర్చున్న ప్రేక్షకుల వెన్నులో వణుకు పుడుతుంది. అంతలా నెగటివ్ షేడ్స్ ని చూపించాడు.
‘అవంతిక’గా తమన్నా – ఇప్పటి వరకూ మిల్క్ బ్యూటీ, గ్లామ్ డాల్ అనిపించుకున్న తమన్నా ఈ సినిమాలో అవంతికగా అందమైన కుందనపు బొమ్మలా కనపడడమే కాదు శత్రువు ఎదురుపడినా, ఒక ఆపద వస్తున్నా నిలబడి ఢీ కొట్టే పాత్రలో బాగా చేసింది. తమన్నా చేసిన స్టంట్స్, కత్తి యుద్దాలు కచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి. పచ్చబొట్టేసినా సాంగ్ లో తమన్నా అందాలు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ అని చెప్పాలి. ప్రభాస్ – తమన్నాల కెమిస్ట్రీ బాగుంది.
‘దేవసేన’గా అనుష్క – దేవసేనగా అనుష్క కనపడేది చాలా తక్కువ టైం. అది కూడా మీరు ట్రైలర్ లో చూసిన లుక్ లో ఓ ఖైదీగా కనిపిస్తుంది. కానీ తను మొదటి సారి నోరు తెరిచి కట్టప్పతో మాట్లాడే సీన్స్ మాత్రం సూపర్బ్.
‘శివగామి’గా రమ్యకృష్ణ – ది పవర్ అఫ్ విమెన్ ని చూపే పాత్ర శివగామి. ఒక రాజ్యాన్ని తన ఆధీనంలో సమర్ధవంతంగా నడిపించగల సత్తా ఉన్న రాణిలా రమ్యకృష్ణ నటన, ఆ పాత్రలోని రౌద్రం అందరినీ కట్టిపడేస్తుంది. శివగామి పాత్రని రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ చెయ్యలేరు. ప్రతి సీన్ లోనూ సూపర్బ్ ఎమోషన్స్ ని చూపారు.
‘కట్టప్ప’గా సత్యరాజ్ – నమ్మకాని, ధైర్యానికి మారుపేరైన సైన్యాధిపతిగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ కనిపిస్తారు. సత్యరాజ్ ఎమోషన్స్ చూపించడంలో ది బెస్ట్ అని కట్టప్ప పాత్రతో మరోసారి మెప్పించాడు. ఇది పక్కన పెడితే తన 60 ఏళ్ళ వయసులో కూడా 25 ఏళ్ళ కుర్రాడిలా ప్రభాస్ తో చేసిన ఫైట్, వార్ ఎపిసోడ్లో చేసిన స్టంట్స్ చూసి కచ్చితంగా షాక్ అవుతారు. ఆ వయసులో కూడా హీరోలైన ప్రభాస్, రానాలకు దీటుగా కత్తి తిప్పుతూ చేసిన రిస్కీ స్టంట్స్ మీ చేత శభాస్ అనిపిస్తుంది.
‘బిజ్జలదేవ’గా నాజర్ – మోసం, స్వార్ధపూరితమైన స్వభావం కలిగిన బిజ్జలదేవ పాత్రలో నాజర్ పర్ఫెక్ట్ గా సరిపోయాడు. నాజర్ ఒక చెయ్యి లేని అవిటివాడిగా నెగటివ్ ఎమోషన్స్ ని బాగానే చూపించాడు.
‘కాలకేయ’గా ప్రభాకర్ – ఓ కౄరమైన ఆటవిక తెగకి చెందిన రాజుగా ప్రభాకర్ నటించాడు. కాలకేయగా ప్రభాకర్ రూపమే ఆడియన్స్ ని భయపెట్టేలా ఉంటుంది. దానికి తోడు ఇతని చేత చెప్పించిన కిలికి భాష డైలాగ్స్ లో ఇంటెన్స్ కనిపించడం తన విలనిజాన్ని మరింత పెంచేలా ఉంటుంది. వార్ ఎపిసోడ్ లో బాగా చేసాడు.
ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా అతిధి పాత్రలో కనిపించిన సుధీప్ అస్లామ్ ఖాన్ పాత్రలో మెప్పించాడు. ఆటవిక ప్రాంతానికి చెందిన లేడీ పాత్రలో రోహిణి నటన బాగుంది. భళ్లాలదేవ దగ్గర ఉండే ఓ యువరాజు అయిన భద్ర పాత్రలో అడవి శేష్ లుక్ బాగుంది. భళ్లాలదేవ కోసం ఏం చెయ్యడానికైనా సిద్దపడే అడవి శేష్ నెగటివ్ షేడ్స్ బాగా చూపించాడు. తనికెళ్ళ భరణి ఓకే. ‘మనోహరి’ సాంగ్ లో కనిపించిన నోర ఫతేహి, స్కార్లెట్ విల్సన్ లు తమ అందచందాలతో ముందు బెంచ్ వారిని ఆకట్టుకున్నారు.
మైనస్ పాయింట్స్ :
అత్యంత భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా వచ్చిన బాహుబలి సినిమాలో చెప్పుకోదగిన మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సినిమా మొత్తం అయిపోయాక కథా పరంగా చూసుకుంటే అంత గొప్పగా అనిపించకపోవచ్చు. ఎందుకు అంటే చాలా సినిమాల్లో చెప్పే రెగ్యులర్ రివెంజ్ స్టొరీనే ఇందులోనూ చెప్పారు. కావున కథా పరంగా మీకు కొత్త పాయింట్ ఏమీ చెప్పరు. అలాగే సినిమాలో కీ పాయింట్స్ ని ఎలివేట్ చేయడానికి కోసం కొన్ని బిల్డప్ సీన్స్ ని రాసుకోవాలి. అలా రాసుకున్న సీన్స్ కొన్ని డ్రాగ్ చేసిన ఫీలింగ్ ని కలిగిస్తాయి. వీటివలనే సినిమా రన్ టైం కూడా ఎక్కువ అయ్యిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.

తీర్పు :
పరాజయమే లేని ఎస్ఎస్ రాజమౌళి – యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి సినిమా అందరినీ సంతృప్తి పరిచే సూపర్బ్ గ్రాఫికల్ విజువల్ వండర్ గా నిలిచిపోయింది.






Comment On... your Rating...