బాహుబలి వాట్సప్ కథకళి

మెయిన్ ప్రోగ్రామ్ ముందు ప్రేక్షకులను అలరించడానికి చాలా డ్యాన్స్‌లు, స్టెప్‌లు వేస్తూ ఉంటారు.‘బాహుబలి’ సినిమా రాకముందే లీక్‌బలీలు మనకు రకరకాల సినిమాలు చూపించేశారు. అందులో లేటెస్ట్ సినిమా... ‘కథ లీక్’. ఇప్పుడు వాట్సప్‌లో హల్‌చల్ అదే! సున్నం లేనిదే కిళ్లీ, సినిమా రానిదే కథ పొక్కకూడదు.మరి వాట్ ఈజ్ దిస్ ‘కథ’కళి...
వాట్సప్ బాహుబలి?
 

ఒక ప్రాంతీయ సినిమా గురించి భాష, ప్రాంతాలకు అతీతంగా దేశమంతటా ఎదురుచూడడం ఇటీవలి కాలంలో ఎన్నడైనా జరిగిందా? ఆ సినిమా గురించి చీమ చిటుక్కుమన్నా వార్తగా చెప్పుకోవడం ఎప్పుడైనా చూశామా? అంతటి క్రేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళాల్లో తయారవుతున్న ‘బాహుబలి’కి దక్కింది. ఈ క్రేజ్ ఎంతదాకా వెళ్ళిందంటే... సినిమా గురించి ఏ చిన్న విషయమైనా అందరి కన్నా ముందు తెలుసుకోవాలనే ఆసక్తి సినీప్రియుల్లో అంతకంతకూ ఎక్కువవుతోంది.

ఆగని లీకుల పరంపర!
వెరసి, పరిస్థితి ఏమిటంటే - ‘బాహుబలి’ గురించి ఇప్పుడు అధికారిక ప్రకటనల కన్నా ఔత్సాహికులు చేస్తున్న అనధికారిక లీకులే ఎక్కువయ్యాయి. గడచిన కొన్ని నెలల్లో - ఈ సినిమాకు సంబంధించి వచ్చిన లీక్‌లు అన్నీ ఇన్నీ కావు. చిన్నా చితకా అంశాలను పక్కనపెడితే, ఫస్ట్ మేజర్ లీక్ - వీడియో లీకేజ్. విజువల్ ఎఫెక్ట్‌ల కోసం యూనిట్ వారు పంపిన 12 నిమిషాల షూటింగ్ ఫుటేజ్‌ను ‘ఇంటి దొంగలు’ కొన్ని నెలల క్రితం నెట్‌లో పెట్టారు.

రెండో మేజర్ లీక్ - ‘బాహుబలి’ స్టోరీ. ‘‘ఈ సినిమా కథ ఇదీ’’ అంటూ... ఇటీవలే ఇంకో లీక్. సోషల్ మీడియా అంతా అదే హల్‌చల్! బయటకొచ్చిన స్టోరీ నిజమో, అబద్ధమో దేవుడెరుగు కానీ... ఆ స్టోరీ వాట్సప్, ఫేస్‌బుక్కుల్లో దేశమంతా తిరిగింది. ఆ కథలోని నిజానిజాల గురించి, దర్శక, నిర్మాతలు పెదవి విప్పలేదు.

అఫిషియల్ రిలీజ్ కన్నా ముందే... ఆడియో
ఈ స్టోరీ లీక్ వచ్చిన అయిదు రోజుల కల్లా, జూన్ 10న ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్‌లోని పాటలు ఆడియో రిలీజ్ కన్నా ముందే నెట్‌లోకి వచ్చేశాయి. క్వాలిటీ కాస్తంత అటూ, ఇటూగా ఉన్నా, ఆ పాటలన్నీ అచ్చంగా సినిమాలోవే! రోజురోజుకూ పెరుగుతున్న ఈ లీక్‌ల వ్యవహారంతో ఖంగు తిన్న ఆడియో సంస్థ చివరకు యూ ట్యూబ్ చానల్‌లో అధికారికంగా పాటను విడుదల చేయాల్సి వచ్చింది.

వెంటాడుతున్న వివాదాలు
‘‘అత్యంత భారీ వ్యయంతో రూపొందిన భారతీయ సినిమాల్లో ఒకటి’’ అంటూ నిర్మాతలు సైతం ఒప్పుకున్న ‘బాహుబలి’ ఇప్పటి దాకా చాలా బాలారిష్టాలే ఎదుర్కొంది. షూటింగ్‌లోనే కాక, పోస్ట్ ప్రొడక్షన్‌లోనూ అవి తప్పలేదు. పబ్లిసిటీ పోస్టర్స్ కాపీ అంటూ ఒక విమర్శ. మే ఆఖరున హైదరాబాద్‌లో జరగాల్సిన తెలుగు ఆడియో రిలీజ్ పోస్ట్‌పోన్‌మెంట్‌తో మరో ఎదురుదెబ్బ. చివరకు ట్రైలర్‌ను నేరుగా థియేటర్లలో, నెట్‌లో వదలాల్సి వచ్చింది.

తీరా నెట్‌లో ఉంచిన ట్రైలర్‌కు 20 లక్షల పైగా హిట్లు వచ్చాక, దానిపై ఇంకో కాంట్రవర్సీ. యూ ట్యూబ్ ఆ ట్రైలర్‌ను తొలగించింది. అనుమానాలు నివృత్తి చేసుకున్నాక మళ్ళీ అనుమతించింది. తాజాగా ఇప్పుడేమో కథ, పాటల లీక్ సరేసరి! వీటన్నిటి మధ్యనే జూన్ 13న తిరుపతిలో భారీ వేడుకలో ‘బాహుబలి’ ఆడియో అధికారికంగా రిలీజైంది.

కథ ముందే చెప్పేసినా... సూపర్‌హిట్సే!
ఈ లీక్‌లు... వాటి వెనుక ఉన్న వ్యక్తులు... లీకు కారణాలు... లీకు కథలోని నిజానిజాలు - వీటన్నిటి మధ్య రాజమౌళి మాత్రం పక్షి కన్నునే చూస్తున్న అర్జునుడిలా తన పని తాను చేసుకుపోతున్నారు. నిజానికి, తన సినిమా స్టోరీ ఏమిటన్నది తానే ముందుగా, అఫిషియల్‌గా చెప్పేయడం రాజమౌళికి అలవాటు. ‘మగధీర’- పునర్జన్మల కథ అనీ, ‘ఈగ’ - ఒక ప్రేమికుడి ప్రతీకార గాథ అనీ ఆయన ముందే చెప్పేశారు. కథ చెప్పేసి మరీ, రిలీజయ్యాక విజయం సాధించారు. ‘బాహుబలి’ - ఇద్దరు సోదరుల మధ్య రాజ్యాధికారం కోసం జరిగే కాల్పనిక జానపద కథ అని ఆయన ఇప్పటికే చెప్పారు. కథ చెప్పేసినా, కథనంతో... విజువల్ వండర్స్ కనికట్టుతో ప్రేక్షకుల్ని కుర్చీలకు కట్టిపడేయడం రాజమౌళి స్పెషాలిటీ. మరి ఈ సారి అదెలా ఉందో చూడాలి. ఇప్పుడొచ్చిన ఈ గాలివార్తల్లోని నిజానిజాలేమిటో బేరీజు వేసుకోవడానికి రానున్న జూలై 10న ‘బాహుబలి - ఫస్ట్‌పార్ట్’ రిలీజ్ దాకా వేచి ఉండాలి!

అనగనగా సువిశాల సుసంపన్న మహిష్మతీ రాజ్యం.ఎత్తై సౌధాలు... ఆకాశాన్నంటే ప్రాకారాలు... పచ్చని ప్రకృతి... పరవశింపజేసే జలపాతాలు...ఒక్క మాటలో... పాడీపంటలతో, పిల్లాపాపలతో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్న భూతల స్వర్గం! వీరత్వం, ధీరత్వం, శాంతి సౌభాగ్యాలకు నెలవైన ఆ రాజ్యానికి అధిపతి అమరేంద్ర బాహుబలి (ప్రభాస్). అందంలో మన్మథుడు... పరాక్రమంలో అర్జునుడు. అతని భార్య దేవసేన (అనుష్క) పుత్తడిబొమ్మ... వెన్నెల కొమ్మ.


క్షీరభాండంలో గరళబిందువులా మహామంత్రి బిజ్జలదేవ (నాజర్). రాజ్యాన్ని కబళించడానికి రాహువులా రాజుగారి సోదరుడు... భల్లాలదేవ (రానా). ఈ దుష్టద్వయం చేతులు కలిపారు.
ఫలితం- వెన్నెల వెళ్ళిపోయింది. అమావాస్య ఆకాశాన్ని ఆక్రమించింది. బాహుబలిని కుట్రపూరితంగా చంపి, రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు.


కథ వింటున్నవాడు: ఆ.. ప్రభాస్ చచ్చిపోతాడా? ప్రభాస్ చనిపోతే ఇక సినిమా ఏంటోయ్!
చెబుతున్నవాడు: మాకేం తెలుసు! ఇది ఇంటర్నెట్‌లో, వాట్సప్‌లో సర్క్యులేట్ అవుతున్న స్టోరీ. ఇంతకీ చెప్పమంటావా? మానమంటావా?
వింటున్నవాడు: అబ్బెబ్బే! నీ జిమ్మడ! ఇంత సస్పెన్స్‌లో పెట్టి, చెప్పనంటావా? తరువాతేమైందో చెప్పు స్వామీ!
చెబుతున్నవాడు: అయితే విను!


ఇక భల్లాలదేవుడి అకృత్యాలకు అడ్డూ ఆపూ లేదు. అతని దృష్టిలో తానే దేవుడు... ప్రజలంతా తనను పూజించాల్సిందే. అందుకోసం ఆకాశాన్నంటే ఓ భారీ విగ్రహం. క్రూరత్వం... నిరంకుశత్వం... రాక్షసత్వం... ప్రజలంతా తనకు బానిసలే. చివరకు పసిబాలుడైన బాహుబలి కుమారుణ్ణీ చంపడానికి ఉద్యుక్తుడవుతాడు.


అంతే..! దేవసేన అపర కాళిక అవుతుంది. భల్లాలదేవుడి అనుచరుల్ని తుదముట్టించి, కొడుకును కాపాడుకొని, రాజ్యం దాటిస్తుంది.తాను చెరసాలలో చందమామలా బందీ అవుతుంది.


వింటున్నవాడు: చెరసాల అంటే ఏంటన్నా?
చెబుతున్నవాడు: జైలు రా! బాబూ! వింటున్నవాడు: ఓ జైలా? మరి చిన్న బాహుబలి ఏమయ్యాడు?
చెబుతున్నవాడు: అక్కడికే వస్తున్నా!

పసి బాహుబలి ఓ గూడెంలో ‘శివుడు’గా (రెండో ప్రభాస్) పెరుగుతాడు. అక్కడివాళ్ళే అతనికి అమ్మా నాన్న! సంపదలు, సామ్రాజ్యాలు లేకపోయినా ప్రేమకు కొదవ లేదు. కన్న తల్లితండ్రులు, కన్నీళ్ళు నిండిన గతం అతనికి తెలియవు.అయినా, పులి కడుపున పులే పుడుతుంది కదా! పెరిగింది అడవిలో అయినా, అమ్మ అందం, నాన్న పరాక్రమం పుణికిపుచ్చుకున్నాడు. అవక్ర విక్రమ పరాక్రమశాలిగా ఎదిగాడు. అందరి తలలో నాలుక అయ్యాడు.

ఇంతలో ఒకరోజు... అనుకోకుండా... అందాల అప్సరస... రాకుమారి అవంతిక (తమన్నా) ఆ అడవిలో ఎదురైంది. మనసు మిరుమిట్లు గొలిపించింది. వలపు విరిజల్లులు కురిిపించింది. అతడి మనసు దొంగిలించి రాజ్యానికి వెళ్ళిపోయింది... అవంతిక లేని లోకం శూన్యం...ఆమెను వెతుక్కుంటూ... శివుడు మహిష్మతికి వెళ్ళాడు...అక్కడ అతనికి గతం తెలిసింది... కర్తవ్యం బోధపడింది...

శివుడు మూడోకన్ను తెరిచాడు. ప్రళయకాల రుద్రుడయ్యాడు. యుద్ధం... కనివిని ఎరుగని మహా యుద్ధం... వేలాది సైన్యం... గజ, తురగ, పదాతిదళాలు...కండలు తిరిగిన వీరులు... దట్టంగా, ట్టంగా ఉన్న యోధులు... కత్తులు... కఠారులు... ఈటెలు... బల్లేలు... చండ్ర పరశువులు... అస్త్రాలు.. శస్త్రాలు.. మర ఫిరంగులు. ఎవరి చేతిలో ఏముందో? ఎవరు ఏది ప్రయోగిస్తున్నారో? ఏ దెబ్బకు ఎవరు ఒరిగిపోతున్నారో తెలియనంతటి పెద్ద యుద్ధం.

కాళ్ళు పోయాయి... చేతులు తెగాయి... తలలు తెగిపడ్డాయి... ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.యుద్ధంలో శివుడొక్కడే నిలిచాడు. శత్రువును హతమార్చి, గెలిచాడు. తండ్రిని చంపినవారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. అమ్మను చెర విడిపించాడు... ప్రజలకు నియంతృత్వపు చెర తప్పించాడు. అమరేంద్ర బాహుబలికి వారసుడిగా శివుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ప్రజలను కన్నబిడ్డలుగా భావించాడు. మహిష్మతి మళ్ళీ కళకళలాడింది. ‘బాహుబలి’కి జయహో అంది.

వింటున్నవాడు: భలే ఉందన్నా... ‘బాహుబలి’ కథ. రాజమౌళి డాడీ విజయేంద్రప్రసాద్ రాసిందేగా! చెబుతున్నవాడు: ఒరిజినల్ కథ ఆయనదే! కానీ, నీకిప్పుడు చెప్పిన ఈ ‘వాట్సప్’లో కథ ఎవరిదో, ఎంత నిజమో తెలీదు.వింటున్నవాడు: డూప్లికేటే ఇంత బాగుంటే, ఇంక ఒరిజినల్ ఎంత బాగుండాలి! చెబుతున్నవాడు: ఆ... పద! కథ కంచికి, మనం ఇంటికి! వింటున్నవాడు: కాదు, కాదు. కథ వాట్సప్‌కి! ‘బాహుబలి’ థియేటర్‌కి! (అని ఇద్దరూ నవ్వుకుంటూ బయల్దేరారు).

No comments:

Post a Comment